ప్రేమ – పెన్ను

My Misak Pen

My Misak Pen


నాకు ఇంకు పెన్ను అంటే చాలా ఇష్టం. బాల్ పాయింట్ పెన్నుకి నేను మారలేకపోయాను. అస్సలు ఎప్పుడూ వాడలేదని కాదు; వాడాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ వాడుతుంటాను. కానీ ఇంకు పెన్ను వాడినంతగా వాడను. ఇంకు పెన్ను నచ్చినంతగా బాల్ పాయింటు పెన్ను నాకు నచ్చదు.

పెన్నుతో రాయడం మొదలు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం చిన్నతనంలో. ముందు పలక మీద బలపంతో రాయడం మొదలు పెట్టాం. తర్వాత పెన్సిలుతో నోటు పుస్తకాల మీద రాసేవాళ్ళం. ఎనిమిదవ తరగతిలో అనుకుంటాను, పెన్ను చేత్తో పట్టుకోవడం మొదలు. పాళీ పెన్నులు. రెండేసి మూడేసి రూపాయలకు కొనుక్కునే వాళ్ళం. స్కూల్ కి వెడుతూ దారిలో షావుకారు కొట్లో అయిదు పైసలకి పెన్నుకు కడుపు నిండా ఇంకు పోయించుకునే వాళ్ళం. పెన్నులు కక్కేవి. వేళ్ళకి ఇంకు అంటుకునేది. అవి కక్కకుండా రకరకాల ఉపాయాలు ఉండేవి. ఇంకు పోసుకున్నాక పాళీ ఉన్న మూత బిగించుకునే ముందు పెన్నుమెడకున్న స్క్రూ లాంటి దానికి సబ్బు రాసి అప్పుడు తిప్పి బిగించే వాళ్ళం. కక్కడం ఆగేది. ఇంకో మెరుగైన ఉపాయం దొరికింది ఒక రోజు. మా క్లాసులో ఒకబ్బాయి తండ్రి రైలు ఇంజను డ్రైవరు. అతను ఇంజను లో వాడే గ్రీజును తెచ్చి ఇచ్చేవాడు. సబ్బు కన్నా అది ఇంకా బాగా కక్కడాన్ని ఆపేది. అతన్ని హీరో లాగ చూసే వాళ్ళం. అతనితో బాగా స్నేహం గా ఉండే వాళ్ళం. మా నాన్న కూడా ఇంజను డ్రైవరు అయి ఉంటే బాగుండేదే అని కూడా నాకు చాల సార్లు అనిపించేది.

ఎందుకో గాని అప్పుదప్పుడూ పాళీలు విరిగి పోతూ ఉండేవి. పెన్నులు కింద పడో, మరీ గట్టిగా వొత్తి రాస్తేనో జరిగేదనుకుంటా. కొన్ని పెన్నులు గరుగ్గా రాసేవి. ఆ పాళీ ని మెత్తగా రాసేలాగా చెయ్యాలంటే అద్దం మీద అరగదియ్యాలని ఎవరో కిటుకు చెప్పారు. చాలా సేపు అలా అరగ దీసుకునే వాళ్ళం.

చాల రకాల మామూలు పెన్నులు ఉండేవి. వాటి కంపనీల పేర్లు తెలియవు. మా ఊర్లో మాదిరెడ్డి వెంకట్రావు కొట్లోకి వెళ్లి పెన్ను అడిగితే ఆయన ఏమి ఇస్తే అదే మాకు పెన్ను. రంగు మాత్రం ఏది కావాలో కాస్త మొహమాట పడుతూ అడిగే వాళ్ళం. అంతే. పలకలు గా ఉన్న అట్ట పెట్టె లో అయిదారు పెన్నులు పడుకుని ఉండేవి పాకింగులో.

కొన్నాళ్ళకి అకస్మాత్తుగా హీరో పెన్నులు వచ్చాయి. బంగారు రంగు క్యాప్. పాళీ మొత్తం కనపడకుండా దాని మొన మాత్రం కనపడే లాగ గమ్మత్తు గా ఉండేది చూడ్డానికి. కొండచిలువ మొహాన్ని పోలి ఉండేది. చాలా నున్నగా ఉండేది. మెడ బారు. ఇంకు గొట్టం, పాళీ లను కలిపే చోట సన్నటి నాజూకైన తెల్లని రింగు లాంటిది ఉండేది. అలంకరణ అనుకుంటా.

దాన్లో ఇంకు పోసుకోడం అప్పటి వరకూ ఉన్న పెన్నుల్లాగా కాదు. ఇంకు సీసాలోనుంచి దాని మూతలోనికి కొంచెం ఇంకు తీసుకుని పెన్ను కడుపులో పొయ్యడం కాదు. అలా పోసేటప్పుడు చూసుకోక పొతే నిండి పోయి బయటకు ఒలికి పోయేది. ఇంకు ఫిల్లర్ వచ్చింది తర్వాత. అదీ అంతే. ఒకో సారి చూసుకోకుండా ఎక్కువ పోసేస్తే బయటకు కారిపోయేది.

కాని ఈ హీరో పెన్ను అలా కాదు. లోపల ఒక గొట్టం, దానికి ఒక పిచికారి లాగ ఉండేది. పెన్ను పాళీ తో సహా ఇంకు సీసాలో పెట్టి ఆ పిచికారీని నొక్కి వదిలితే ఇంకు లోపలి పీల్చుకునేది. ముందు కొంచెం గాలి బుడగలు వచ్చేవి. రెండు మూడు సార్లు నొక్కి వదిలితే గాలి బయటకు పోయి దానినిండా ఇంకు నిండేది. ఎక్కువ ఇంకు పట్టేది కాదు, పాత పెన్నుల తో పోలిస్తే. కాని దీనికున్న ఉపయోగాలు దీనివి. పెన్నులు కక్కేవి కావు. పాళీలు బాగా నున్నగా రాసేవి. క్యాప్ లు స్క్రూ ల తో తిప్పి తిప్పి బిగుంచుకో నక్కర లేదు. అలా పైనుంచి నొక్కితే చక్కగా మెత్తగా జారి మూసుకు పోయేవి. కాస్త ఖరీదు ఎక్కువ కాని, నదరు గా ఆనేవి. ఫ్యాషన్ కూడాను. హోదాను కూడా తెలియ చేసేవి. అందరూ కొనుక్కోలేకపోయే వారు కదా. ఈ రోజులల్లో ఐ ఫోనో ఫైవో, సామ్సంగో గెలాక్సీయో పట్టుకుని తిరగడం లాగ అన మాట ఇంచు మించుగా.  

అప్పుడప్పుడే బాల్ పాయింటు పెన్నులు రావడం మొదలయ్యింది. మోటుగా  ఉండేవి. ఇనుముతో తయారయ్యేవి. లోపల రీఫిల్ కూడా ఇనుమే. సీవెండి రంగులో ఉండేవి. రీఫిళ్ళతో కాగితం మీద బరికి బరికి సరిగా రాస్తోందో లేదో చూసి తీసుకునే వాళ్ళు. ఈ బాల్ పాయింటు పెన్ను, రీఫిళ్ళు ప్లాస్టిక్ వి రావడానికి చాలా కాలం పట్టింది. విల్సన్ కంపనీ వాళ్ళు పైన ఒక నొక్కు నొక్కితే కిటుక్కున చప్పుడు చేసుకుంటూ రాసుకోడానికి రీఫిల్ బయటకు వచ్చేలాగా స్ప్రింగ్ యాక్షన్ తో తయారు చేసి అమ్మే వారు. ఆశ్చర్యంగా ఉండేది. అది కొనుక్కుని అస్తమానూ కిటుక్కు కిటుక్కు మని నొక్కుతూ ఆనందించే వాళ్ళం. బరువైన ఇనప బాల్ పాయింటు పెన్నులు కనుమరుగు కావడం మొదలయ్యాయి. ఇప్పుడు మచ్చుకు చూద్దామన్నా ఎక్కడైనా ఉనాయో లేవో. మా ఇంటిలో కాంగ్రెస్స్ సభ్యత్వ జాబితాలు రాసేటప్పుడు ఆ బరువైన ఇనప బాల్ పాయింటు పెన్నులు వాడే వారు మా నాన్నగారితో కలిసి పని చేసే కార్యకర్తలు. జేబులో హీరో పెన్ను ఉన్నా కాగితం కింద కార్బన్ పెట్టి రాసే సభ్యత్వ జాబితాలు రాయడానికి ఆ మోటైన ఇనప బాల్ పాయింటు పెన్నులే వాడేవారు. జేబుల్లోంచి ఖరీదైన హీరో పెన్నులు, పైలెట్ పెన్నులు తీసే వారు కాదు. అన్నట్టు, హీరో లాగానే ఇంచుమించు అదే సమయానికి పైలెట్ పెన్ను కూడా వచ్చేసింది.

అప్పుడు మా జిల్లాల్లో రత్నం పెన్ను, బ్రహ్మం పెన్ను బాగా ప్రాచుర్యం లో ఉండేవి. రత్నం రాజమండ్రి వారిది; బ్రహ్మం బెజవాడ వారిది. మామూలు రకం నించి బంగారు తొడుగు ఉన్న పాళీల ఖరీదైన పెన్నుల వరకూ ఉండేవి వారివి.

నాకు చిన్నప్పటి నుంచీ హైదరాబాదు రాక పోకలు ఉండేవి కాబట్టి, డెక్కన్ పెన్ స్టోర్ నాకు బాగా పరిచయం. అబిడ్స్ సర్కిల్ నుంచి కోటీ వెడుతూంటే జీపీవో దాటి కాస్త దూరం నడిస్తే కుడి చేతి పక్క చిన్న కొట్టు వారిది. నా చిన్న నాటికే అది చాల పాతది. వారు ఇప్పటికీ పెన్నుల వ్యాపారం చేస్తున్నారు. అక్కడినించి మార్చి అబిడ్స్ లో ఒక మాల్ లో కొట్టు తీసుకున్నారు. బేగం పేట, సికింద్రాబాదుల్లో కూడా వాళ్ళ కొట్లు ఉన్నాయి ఇప్పుడు.

వారి సొంత తయారీ పెన్ను మిసాక్. మిసాక్ అంటే ఏమిటో అర్ధం అయ్యేది కాదు. కొనుక్కునే వాళ్ళం. తర్వాత చాలా కాలానికి తెలిసింది. అది కాశిం అనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ ను తిరగేసి రాస్తే మిసాక్ అవుతుంది అనీ, దాని పేరు అలా పెట్టారు అని.

మా ఊరు వదిలి వచ్చాక డెక్కన్ పెన్ స్టోర్ పరిచయం కాక పొతే నేనూ ఇంకు పెన్ను ప్రేమలోనించి బయట పడిపోయేవాడినేమో. సరిగ్గా బాల్ పాయింటు పెన్నులు ప్రాచుర్యం లోకి వస్తున్న రోజుల్లో నేను మిసాక్ కి అలవాటు పడ్డాను. అప్పుడప్పుడూ సౌలభ్యం కోసం బాల్ పాయింటు వాడినా, ఇంకు పెన్ను లేకుండా నేనూ ఎప్పుడూ లేను.

డిగ్రీ పూర్తి అయ్యాక నేనూ ఢిల్లీ వెళ్ళాను. జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో చదువుకోసం. నేనూ ఎం ఏ లో చేరిన కొద్ది రోజుల కే నాన్నగారు నాకు ఒక ఫారిన్ పోర్టబుల్ టైపు రైటర్ తెప్పించి ఇచ్చారు. అప్పటి నించి నేను ఇంగ్లీసు చేత్తో రాయడం బహు అరుదు అయిపొయింది. తెలుగు రాసే అవసరం కూడా బాగా తక్కువగానే ఉండేది. ఇంటికి, అమ్మకి ఉత్తరాలు రాయడం మినహా చదువుకు సంబంధించినదంతా ఇంగ్లీషు లోనే కదా. రాత అంతా టైపు రైటర్ మీదే. చాల మంది ముందు కాగితం మీద రాసుకుని తర్వాత టైపు చేయించు కోవడమో, చేసుకోవడమో చేస్తారు. నాకు మాత్రం  మొదటి నుండీ నేరుగా టైపు రైటర్ మీద రాయడం అలవాటు అయ్యింది. 

ఢిల్లీ నుంచి లండన్ వెళ్లేసరికి కంప్యూటర్లు అప్పటికే వాడుకలోకి ప్రవేశించాయి అక్కడ. లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో అయితే ఒక పెద్ద హాల్ లో ఒక వంద కంప్యూటర్లు విద్యార్ధుల కోసం ఉండేవి. ఇరవై నాలుగు గంటలూ ఆ హాల్ తెరిచి ఉండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వెళ్లి అక్కడ రాసుకునేలాగా అవకాశం ఉండేది. ఆ రోజుల్లో రాత చాల వరకూ కంప్యూటర్ మీదే జరిగినా నా జేబు లో ఎప్పుడూ ఒక ఇంకు పెన్ను ఉండేది.

ఇక ఆ రోజుల్లో మొదలయ్యింది వివిధ ప్రసిద్ధ బ్రాండ్ల ఇంకు పెన్నుల మీద మోజు పడడం. మోంబ్లా, వాటర్ మాన్, ప్రెసిడెంట్, సెనేటర్, క్రాస్, పార్కర్, షీఫర్, రోట్రింగ్, ఇలాంటి వన్నీ కొనుక్కోవడం, వాటితో రాయడం ఒక వ్యసనం గా మారింది. ప్రతి బ్రాండ్ వాళ్ళ రకరకాల మోడళ్ళను కొనుక్కోవడం. ఆ పెన్నులకు తగ్గ మంచి మంచి ఇంకులు కొనుక్కోవడం. ఈ పిచ్చి మొదలయ్యింది. మంచి పెన్ను, చేతికి నిండుగా ఉండేది, శ్రద్ధగా శ్రేష్ఠంగా తయారు చేసింది, మంచి పాళీ ఉన్నది, బాగా నిగానిగా మెరిసేది, కళగా ఉండేది చూస్తే మనసు ఆగదు. కావాలంటుంది. ఏదో ఒక ఖర్చు తగ్గించుకుని దాన్ని కొనుక్కోవడం అలవాటుగా మారింది. అలాంటి పెన్ను జేబులో ఉంటే ఏమిటో ఏకే-47 చేతిలో ఉన్నంత ధైర్యం, సాయుధుడిని అన్న భావం.

అలా అలా సంవత్సరాలు గడిచిన కొద్దీ ప్రపంచంలో అత్యుత్తమం అనుకున్న పెన్నులు ఒక ముప్ఫై దాక పోగయ్యాయి నా దగ్గర. వెలకట్ట లేనివి అవి. అందులో చాలా పాతవి, ఈ మధ్యే వచ్చినవి, లిమిటెడ్ ఎడిషన్లు గా విడులైనవి చాల ఉన్నాయి.

ఒకొక్క పాళీ ఒకోలా ఉంటుంది. ఒకోలా రాస్తుంది. ఒకోలా కదులుతుంది. దేని వ్యక్తిత్వం దానిదే. ఏ పెన్ను ప్రత్యేకత ఆ పెన్నుదే. దేని అందం దానిదే. ఒకోదాన్ని ఒకోలా పట్టుకోవాలి. ఒకో దానికి ఒకో రకమైన సంరక్షణ చెయ్యాలి. అన్నిటినీ తరచూ ముట్టుకుంటూ ఉండాలి. దేన్నీ నిర్లక్ష్యం చెయ్య కూడదు. అన్నింటినీ అపురూపంగా చూసుకోవాలి.

పాళీ పెన్ను లేకుండా నన్ను నేనూ ఊహించుకోలేను, బహుశా.

12 Responses to “ప్రేమ – పెన్ను”

 1. July 10, 2013 at 4:24 pm #

  Prathi okkarini palukarinchinatuvanti gnapakalanu gurthu cheinanduku kritagnathalu

  • July 12, 2013 at 4:26 pm #

   Pleasure, Sir.

 2. July 10, 2013 at 4:29 pm #

  Thank you Sir, it recollects my childhood days

  • July 12, 2013 at 4:26 pm #

   Thank you, Sir.

 3. July 10, 2013 at 5:37 pm #

  Mine is a similar story. I have a pen fetish all my life. Can’t live without an ink pen. Can’t live without adding to my collection of ink pens.

  Warm Regards,

  Hari Ankem

  • July 12, 2013 at 4:25 pm #

   Nice to know, Hari.We should form a club, I think.

 4. July 10, 2013 at 8:28 pm #

  గతం జ్ఞాపకాల్లోకి తొంగి చూసుకుంటే ఇలాంటి తియ్యటి అనుభూతులెన్నో… ఒక్క

  అంగలో అంత జీవితాన్నీ దాటేసినట్లపిస్తుంది. ఇంకు పాళీ తో మీ అనుబంధం

  చక్కగా రాశారు. అభినందనలు!

  • July 12, 2013 at 4:25 pm #

   Thanks, Ulchaala garu.

 5. August 24, 2014 at 4:14 am #

  Very nice. Reminded of my childhood. Thoroughly enjoyed your writing.

 6. September 9, 2014 at 10:32 pm #

  బాల్యం గుర్తుకు వచ్చిన క్షణం ఇది. యాపిల్‌ కీబోర్డులు,యూనికోడ్‌ అక్షరాలు మధ్య బతుకుతూ పెన్నూ,ఇంకు మరకలు మరిచిపోయిన తరానికి ఒక మధురమైన జ్ఞాపకం ఇది. కామిల్‌సిరాతో పెన్నుల కడుపు నింపడం, జేబులకు ఇంక్‌ మరకలు, తళతళా మెరిసే పాళీలు, ఇంక్‌బుడ్డీలు…. ఏవీ ఆ మధురమైన రోజులు… చాలా కాలం తరువాత ఓ అద్బుతమైన రచన చదివిన అనుభూతి…. ఇటీవల నా ఇన్సిపిరేషన్‌ ఈ ఆర్టికల్‌ … పరిచయం అక్కరలేని పరకాల ప్రభాకర్‌ గారు రాసిన మధురమైన జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటున్నాను.

 7. September 20, 2015 at 9:06 am #

  Liked your blog. One thing though. Misak is not a pen manufactured by Deccan Pen Stores. They had a small shop/factory a little distance into gowliguda when one went in from kothi. It was there that these pens were made and sold. Deccan Pen Store was just a sales outlet.

  • November 18, 2015 at 6:16 pm #

   Oh! Thanks. I thought it was their product. I still visit their shop sometimes in Abids and mostly in Begumpet. They never told me that it was not their product. I mentioned it many times, and they nodded that it was their product.

Leave a Reply